Easy Methods to Grow Wheat Grass

Easy Methods to Grow Wheat Grass

గోధుమ గడ్డి ని పెంచే సులభ పద్ధతులు

      సర్వ రోగ నివారిణిగా మనం తెలుసుకున్న ఈ గోధుమ గడ్డిని ఎలా పెంచాలో తెసుకుందాం. దీన్ని పెంచడం చాలా సులభం. ఇందుకు 1 అడుగు పొడవు, 1 అడుగు వెడల్పు , 3 అంగుళాల లోతు కలిగినవి సరిపోతాయి. దీనికి పగిలి పోయిన కుండీలు గానీ, చెక్కతో చేసినవి గానీ, పాత బుట్టలు గానీ, రేకుతో చేసిన ట్రేలు గానీ వాడ వచ్చును. లేదా మనకు పెరటి లో మొక్కలు పెంచడానికి స్థలం ఉంటే అందులోనే వీటిని కూడా పెంచవచ్చు. గోధుమ గడ్డి రసం చేసుకోవడానికి, దాని వయసు 7 రోజలుండాలి. కాబట్టి మనం 7 కంటే ఎక్కువ కుండీలు, ట్రేలు, లేదా చిన్న మడులు తయారు చేసుకోవాలి. ఒక మనిషి కి సరిపడా కొలతలు ఇచ్చాను. ఇంటిలోని సభ్యుల సంఖ్యను బట్టి వాటి సైజును నిర్ణయించు కోవాలి.

ఎలాంటి మట్టి మంచిది

      సాధారణంగా అన్ని రకాల మట్టిలో గానీ, నేలలలో గానీ వీటిని పెంచుకోవచ్చు. పూర్తి గా బంకమట్టి నేలలు అంత అనుకూలం కావు. అయితే మనం సహజంగా గోధుమ గడ్డిని పెంచు కోవాలను కుంటున్నాము కాబట్టి, ఇంతకు మునుపు రసాయనికి ఎరువులూ, పురుగుల మందులూ వాడని నేలను గానీ, అలాంటి నేలలో నుండి తెచ్చిన మట్టిని గానీ వాడాలి. ఈ మట్టిలో కొంత ఎరువును కలపాలి. అది సహజంగా లభించే పశువుల ఎరువును మాత్రమే కలపాలి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో పశువుల ఎరువు సులభంగా లభ్యమౌతుంది. అదే పట్టణాలలో కొంత కష్టపడి సంపాదించు కోవాలి లేదా కొనాల్సి వస్తుంది. అది దొరకలేదని మాత్రం ఎలాంటి రసాయనిక ఎరువులు కలపొద్దు. ఎరువు దొరక్క పోతే మీకు ఇంట్లో మిగిలే ఆర్గానిక్ వేస్ట్ (కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మొదలైన వాటి నుండి వచ్చేది) నైనా వాడొచ్చు. అంతే గానీ ఇవి దొరకక పోతే అలాగే వదలి వేయండి తప్ప, ఏ విధమైన రసాయనిక ఎరువులను మాత్రం కలపొద్దు.

విత్తనాలను మొలకెత్తించడం

      కుండీలను సిద్ధం చేసిన తర్వాత, మంచి గోధుమలను సేకరించండి. వాటిని బాగా శుభ్రం చేయండి. వీటిని నేరుగా మట్టిలో వేయడం ఒక పద్ధతి. అయితే ఇందులో మొలకెత్తే విత్తనాల శాతం తగ్గుతుంది. కాబట్టి వీలైతే, వాటిని మొలక కడితే దాదాపు అన్ని విత్తనాలు మొలకెత్తి ఎక్కువ గోధుమ గడ్డి వస్తుంది.

      మొలక కట్టాలంటే గోధుమలను కనీసం 12 గంటలకు పైగా నాన బెట్టాలి. ఆ తర్వాత ఆ నాన బెట్టిన గింజలను ఒక తడి గుడ్డలో వేసి గట్టి గా కట్టాలి. మరో 18 నుండి 24 గంటల లోగా విత్తనాలన్నీ మొలకెత్తి ఉంటాయి. వాటిని కుండీలలోని మట్టిలో వేయాలి. ఒక్కొక్కరూ తాగడానికి కనీసం 100 నుండి 150 మిల్లీ లీటర్ల గోధుమ గడ్డి రసం కావాలి. దీనికి వంద గ్రాములకు పైనే గడ్డి కావాలి. కనుక 100 గ్రాముల గోధుమలను ఒక్కొక్క ట్రేలో వేయాల్సి ఉంటుంది.

      కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి, ట్రేల సైజు, వేయవలసిన గోధుమ విత్తుల పరిమాణం నిర్ణయించుకోవాలి. మొలక కట్టిన విత్తనాలు మడులలో వేసిన తర్వాత, అవి బయటకు కనిపించకుండా వాటి పైన పలుచగా మట్టిని చల్లాలి. అనంతరం కొద్దిగా

నీటిని చిలకరించాలి(spray water). వీటికి ఇతర సీజన్ లలో రోజుకు ఒక సారి నీటిని చిలకరిస్తే సరితుంది. అదే వేసవి కాలంలో నైతే రోజుకు కనీసం రెండు సార్లు నీటిని చల్లవలసి ఉంటుంది. ఎండా కాలంలో ఒక గంట ఎండ తగిలితే చాలు. మిగలిన కాలాల్లో 2 నుండి 3 గంటలు ఎండ తగలినా ఇబ్బంది లేదు. ఆ విధంగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది సాధ్యం కాని పక్షంలో వాటిని అలా వదలి వేయాలి. దాని గురించి పెద్దగా చింతించాల్సిన పని లేదు.

      ఇలా మొక్కలు 7 రోజలు పెంచాలి. 8 వ రోజు మొక్కలు 4 నుంచి 5 అంగుళాలు పెరిగి ఉంటాయి. వాటిని కత్తెరతో, అందినంత కింది వరకూ కత్తిరించుకోవాలి. ఇప్పుడు గోధుమ గడ్డి, జ్యూస్ చేసుకోవడానికి సిద్ధం. ఇక ఆ ట్రేలలోని మట్టిని బయట ఎండలో నేల పైన వేయాలి. అది బాగా ఎండిన తర్వాత దాన్నే తిరిగి మొలకెత్తించడానికి వాడకోవచ్చు.

గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవడానికి ముందు

      గోధుమ గడ్డి జ్యూస్ లో ఎక్కువ పరిమాణంలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీనులు, ఎంజైములూ తదితరాలు ఉంటాయి. వాటి నుండి మనం పూర్తి ప్రయోజనం పొందాలంటే మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకొని తర్వాత దాన్ని తాగడం ఆరంభించాలి. అతి చిన్న చిన్న విషయాలలో శ్రద్ధ తీసుకుంటే మన శరీరం శుభ్రమై పోతుంది. అలా చేయని వారికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీనిక ఒక ఉదాహరణ చెబుతాను.

      మొలకలు తినడం చాలా ఆరోగ్యం అని ఎవరో మనతో చెబుతారు. కానీ మనకు మల బద్ధకం సమస్య ఉంటుంది. కానీ దాన్ని మనం గుర్తించకుండా వెంటనే మొలకలు తినడం ఆరంభిస్తే, మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. విపరీతమైన గ్యాసు తయారై మనం ఆస్పత్రికి పరుగు పెట్టాల్సి వస్తుంది. అక్కడ అల్లోపతి డాక్టరు గారు తో తిట్లు తినాల్సి వస్తుంది.

మార్పుకు కొంత సమయం తప్పని సరి

      కాబట్టి మనం సాధారణంగా తినే ఆహారాన్ని మార్చాలనుకున్నప్పుడ కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. అలా మార్చమని చెప్పేవారు అందుకు కొన్ని నియమ, నిబంధనలు కూడా చెబుతారు. అవి తప్పని సరిగా విని, అర్థం చేసుకుని, పాటించాలి. లేకపోతే ఆరోగ్యం రావడం మాట అటుంచి, అనారోగ్యం పాలు కాక తప్పదు జాగ్రత్త. వారు చెప్పిన నిబంధనలు పాటించకుండా, ఇబ్బందులు తెచ్చుకుని, చెప్పిన వారిని నిందించడం తరచూ జరుతూ ఉంటుంది.

      ఆహారపు అలవాట్లు మార్చుకోవడానికి ముందు మొదట చెయ్యాల్సింది, తాగే నీటి పరిమాణం పెంచుకోవడం. రోజుకు కనీసం 3.5 నుండి 5 లీటర్లు వరకూ వయసూ, శరీర బరువునూ బట్టి, తప్పని సరిగా తాగాలి. ఈ నీటిని కూడా ఖాళీ కడుపుతోనే తాగాలి. ముఖ్యం గా ఉదయం పడగడుపున(ఖాలీ కడుపుతో) ఎక్కువ నీటిని(1.5 నుండి 2 లీటర్లకు పైగా) తాగడం అలవాటు చేసుకోవాలి. వీటిని రెండు విడతలుగా తాగాలి. ఇక మిగిలిన నీటి కూడా కడుపు ఖాళీగా ఉన్నప్పుడే తాగాలి. అంటే భోజనానికి అరగంట ముందూ, భోజనం చేశాకైతే గంటా, గంటన్నర తర్వాత తాగాలి.

      ఇలా నీటిని తాగడం అలవాటు చేసుకున్నాక, రోజులో ఒక్క పూట పండ్లు, కూరగాయలు మాత్రమే తినడం అలవాటు చేసుకోవాలి. తర్వాత రాత్రి భోజనాన్ని సాయంత్రం 7 గంటల లోగా ముగించడం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ వెంట

వెంటనే చేయరాదు. ప్రతి ఒక్కదానికి కొంత కాల పరిమితి నిర్ణయించు కోవాలి. కొత్తదనానికి అలవాటు పడటానికి శరీరానికి కొంత కాలం పడుతుంది. మనం ఆరోగ్యంగా జీవించాలంటే ఓపికగా ఈ మంచి అలవాట్లను చేసుకోక తప్పదు. ఇలా శరీరం ఒక క్రమశిక్షణ కు అలవాటు పడ్డాక, క్రమంగా తెల్ల బియ్యం, గోధుమలతో తయారు చేసే ఆహార పదార్థాలు మానుకోవాలి. వాటి స్థానంలో సిరి ధాన్యాలైన కొర్రలూ, ఆరెకలూ, సామలూ, ఊదులూ, అండు కొర్రలూ ఒక్కొక్కటీ రెండు రోజులు చొప్పున తినడం ప్రారంభించాలి.

      మొదట్లో ఈ సిరిధాన్యాలను తినడం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి మొదట ఒకపూటతో ప్రారంభించాలి. అది కూడా వీటితో సంగటి చేసుకుంటే తినడం సులువౌతుంది. ఇందులోకి మన కిష్టమైన పులుసు కూరలు చేసుకోవాలి. అప్పుడే బాగా తినగలుతాం. అలాగే పెరుగుతో తిన్నా సిరిధాన్యాల అన్నం, సంగటీ చాలా బాగుంటాయి. వీటిని వండడానికి ఒకే ఒక చిన్న మార్పు ఏమంటే ఈ  గింజలను కనీసం 2 నుండి 4 గంటల వరకూ నీటిలో నాన బెట్టిన తర్వాతనే వండుకోవాలి. అప్పుడే పూర్తి ఫలితం లభిస్తుంది. మనం బియ్యం, గోధుమలతో చేయగల అన్ని రకాలూ, ఈ సిరి ధాన్యాలతో చేసుకోవడం కుదురుతుంది. ఇడ్లీలూ, దోసెలూ, బిసిబేళా బాత్, చిత్రాన్నాలూ వీటిలో కొన్ని. ఇతర అన్ని రకాలూ ప్రయత్నించ వచ్చు. మీరు పాటించ వలసిన నియమాలు. 1.వీటిని వండడానికి ముందు కనీసం 2 నుంచీ 4 గంటలు నాన బెట్టడం. 2. ప్రతి రెండు రోజులకు ఒక రకం ధాన్యాలను మార్చి తినడం. 3. అన్నీ ధాన్యాలు ఒకే సారి కలిపి వండరాదు. ఈ విధానంలో మనకు ప్రారంభంలో కొన్ని మంచి మార్పులు కనిపించినా, పూర్తి ఫలితాలు రావడానికి కనీసం 6 నెలల నుండీ రెండు సంవత్సరాల కాలం పడుతుంది. అయితే ఈ ఫలితాలు మనలను శాశ్వత రోగ విముక్తులను చేస్తాయి. అల్లోపతి లో లాగా ఇన్ స్టంట్ రిలీఫ్ వస్తుందని ఆశించి భంగ పడకండి.

     ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియ జేయండి.

     సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసా లను రెగులర్ గా చదవండి.

     ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.

 

Please Share It

Leave a Comment